Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

పాప పరిహరణము

మనోవాక్కాయములచే పాపమునుండి తొలగవలెనంటే సచ్చింతనమును, సత్కార్యాచరణమును విడువకుండుటొక్కటే ఉపాయం. సమర్థ రామదాసు, తులసీదాసు, అప్పయ్య దీక్షితులు, తాయుమానవారు, పట్టిణత్తారు. మున్నగు మహనీయులు, తేవారకర్తలు-సతతసత్కర్మాచరణంతోనేకాలమును గడిపిరి. వారు మనకిచ్చిన భక్తిరచనలు, ఆధ్యాత్మిక గ్రంథములు నేటికి మన కుద్బోధకములుగా ఉంటున్నవి. సమర్ధ రామదాసస్వామి దాసబోధ, తులసీదాసుల రామచరితమానసం వంటి భక్తిగ్రంథములు మరిలేవు. పాపచింతనం, పాపాచరణం ఎట్టివో వారెరుగరు. మన ప్రాంతస్థులై తాయుమానవారు. పట్టిణత్తారుగూడా అట్టి భక్తశిఖామణులే.

పాపాచరణం, పాపచింతనం మానుకోవలెనని మనం నిశ్చయించుకొన్నకొద్దీ ఆ నిశ్చయంవల్లనే పాపస్పృహ కలిగి, వెంటనే పాపమార్గంలో తప్పకుండా పడిపోతూవుంటాము. నేను పైనచెప్పిన మహానుభావులు త్రికరణములచే పుణ్యమునుతప్ప మరొకటి ఆచరించు టెరుగరు. కాబట్టి వారి మనస్సులలో పాపం చొరబారుటకవకాశ##మేలేదు. 'మీరు కామాన్ని ఎలా జయించా'రని వెనుకటి కొక సన్యాసినడిగితే, ఆయన 'కామం నాచిత్తకవాటాన్ని తట్టినపుడు నాకు వినిపించుకొనే తీరిక ఉండేది కాదు. దాని దారి నది మరలిపోయేది' అని సమాధానం చెప్పెనట. కాగా, మనస్సు శూన్యంగా ఉన్నప్పుడే కామము, తత్సంబంధి సల్లాపాలు చల్లగా దానిలో ప్రవేశిస్తవి. అట్లుగాక ఎప్పుడు సచ్చింతనముతో ఉండే మనస్సులందరకీ కామం అడుగు పెట్టదు. కాబట్టి దుస్సంగాన్ని విడిచిపెట్టవలెనంటే సతత సత్సంగ మలవరుచుకోవాలి.

ఎప్పుడూ సదాచరణం చేస్తూవుంటే అదే అలవాటవుతుంది. అంతట ఆ పాపపు దుంపలు ఇరిగి, ఎండి, చచ్చిపోతవి. కనుక పాపాని కెప్పుడూచోటుపెట్టకు, సదాచరణం అలవాటు చేసుకో, ఏదో జపంచేస్తూ కూర్చుంటానంటే ప్రయోజనం లేదు. నోరు వూరకే జపిస్తూవుంటే మనస్సు తన పాపమార్గాన తాను విహరిస్తూనే ఉంటుంది. సద్గ్రంథపఠనం చేస్తూవుండు, లేదా సద్గ్రంథములకు ప్రతులు వ్రాస్తూవుండు. మనస్సుకు, నోటికి, చేతికి ఇలా మంచిపనులు చెప్పి చేస్తూవుంటే పాపం నీమనస్సుదరికి రాకుండా తొలగిపోతుంది. అప్పయ్యదీక్షితులవారు శ్రీ వరదరాజస్వామి నెలా స్తుతించారో చూడండి!

''మన్యే సృజన్త్వభినతిం కవిపుంగవాస్తే

తేభ్యో రమారమణ మాదృశ ఏవ ధన్యః

త్వద్వర్ణనే ధృతరసః కవితాతిమాన్ద్యాత్‌

య స్త త్తదంగ చిరచింతన భాగ్యమేతి!''

స్వామీ! ఇతర కవిపుంగవులు ఆశురచనచే నిన్ను స్తుతిస్తారు. నిజమే. నేనట్లు శీఘ్రంగా రచన చేయలేను. కాని ఆలోచించిచూస్తే వారికంటే నేనే ధన్యుడను. ఎందువల్లనంటే నిన్ను వర్ణించునప్పుడు నీ వివిధాంగ సౌందర్యమీద నా మనస్సు చిరకాలం లగ్నమవుతుంది, ఇది నా భాగ్యం కదా!

కాబట్టి మనస్సు సచ్చింతనం చేస్తూవుంటే పాపం దానంతట అదే తొలగిపోతుంది. ఈశ్వరుని కల్యాణగుణాలను కీర్తించిన మన భక్తులు తమ చిత్తములను ఆ విధంగా ఈశ్వరాయత్తం కావించారు. 'పాపమా! నువ్వు తొలగిపో' అన్నంత మాత్రాన అది తొలగిపోదు సరికదా, అక్కడేపీట పెట్టుక కూర్చుంటుంది. పాపాన్ని పరిహరించుటకు-సత్సంగం. సచ్చింతనం. సద్భాషణం, సదాచరణం-వీనిని ఏమరకుండుటే మార్గం.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page